Image Credit: Gemini AI Read Part - 1
Read Part - 2
మార్కెట్ల పరిస్థితి అంత బాలేదు, అన్నాడు మస్తాన్. అది సరదాగా అన్నట్లు అనిపించినా, మస్తాన్ మోహంలో ఏ కదలికా లేకపోవడం వల్లనో, గొంతు లో ఏ భావమూ పలుకక పోవడం వల్లనో, కళ్ళు క్రిందికి చూడడం వల్లనో, లేక మోహన్ కి మస్తాన్ మీద ఉన్న అభిప్రాయం వల్లనో, మొత్తానికి, సరదా స్టేట్మెంట్ మాదిరి లేదు. మస్తాన్ కి మార్కెట్ మీద పెద్ద ఆసక్తి లేదు. బహుశా, తన పరిస్థితి మస్తాన్ కి తెలుసేమో? మస్తాన్ లాంటి వాళ్లకి ఇతరుల విషయాలు, ముఖ్యంగా కష్టాలు, అలా తెలుస్తూ ఉంటాయి.
అవును, మార్కెట్ అస్సలు బాలేదు.
ఇంకా చెప్పాలంటే, తాను పెట్టుబడి పెట్టిన సరుకుల (కమోడిటీస్) విపణి
పరిస్థితి అస్సలు బాగాలేదు. తను, డాక్టర్ జే తో కలిసి తృణ
ధాన్యాల పైన - నాల్గు రోజుల క్రితం క్వింటాలు 2800 రూపాయలు చొప్పున 5 టన్నుల; అంటే యాభై క్వింటాళ్ల ఆర్దరు పెట్టాడు. అదేం మాయో, పెట్టిన గంట వరకూ కొద్ది గా పెరిగింది. తర్వాత
పడిపోవడం మొదలైంది. నిన్న సాయంత్రానికి 2400 రూ. అయ్యింది. మార్జిన్ పేమెంట్ కట్టమని
బ్రోకర్ నుంచి మెసేజెస్ వొస్తూ ఉన్నాయి.
డాక్టర్ జే తో మోహన్ కి
ఈ మధ్యనే పరిచయమయ్యింది. ఆయన ఒక మనస్తత్వ శాస్త్ర నిపుణుడు. శ్రీనివాసా కాంప్లెక్స్ కి వచ్చి కొన్ని నెలలే అయినా, అందరూ ఆయనను పలకరిస్తారు. కానీ, డాక్టర్ జే ప్రత్యేకంగా పరిచయం పెంచుకుని మరీ దగ్గర అయ్యింది
కొంత మందితో మాత్రమే. అందులో మోహన్ ఒకడు. తన దగ్గరున్న
చివరి లక్షన్నర పొదుపుగా వాడుకోకుండా, యిలా మార్కెట్ లో పెట్టడానికి డాక్టర్ జే
వాక్చాతుర్యమా, లేక ఆయన తెలివి తేటలని నమ్ముకుని తాను గట్టెక్కితే చాలు అన్న ఆశనా, లేక తనని గుర్తించి స్నేహ హస్తం చాచినందుకు, తాను చెల్లించుకుంటున్న రొక్కమా - ఈ ఆలోచనలు మోహన్ కి చూచాయగా వచ్చినా, తనలోని ఆశావాది వాటిని దగ్గరికి రానీయకుండా
చేస్తున్నాడు.
డాక్టర్ జే తో పేకాట దగ్గరే పరిచయం. ఒక రోజు ఆట తర్వాత, డాక్టర్ జే మోహన్ ని ఆపాడు.అప్పటికే మోహన్ ని స్టడీ చేసి వున్నాడు కాబోలు. రెండో పెగ్గు కొంచెం స్ట్రాంగ్ గా
కలిపి యిచ్చాడు. మోహన్ సిప్ చేస్తూంటే తను మాత్రం మసాలా పల్లీలు నములుతూ, మొదటి పెగ్గు నే ఇంకా లాలిస్తూ, తన వ్యాపార రహస్యం మోహన్ తో
పంచుకోదలచుకున్నానని చెప్పాడు.
"స్టాక్ మార్కెట్ దేముంది. అందరూ పెడతారు. బ్లూ చిప్సూ, ఇండీసెసూ అంటూ తనకలాడుతూ వుంటారు. రిస్కు అన్నింటిలోనూ వుంటుంది. కానీ, షేర్లు కొని, అమ్మాలంటే, ఎక్కువ మొత్తం రిస్కు తీసుకోవాలి. ఎవడో నడిపే
వ్యాపారం.అదీ మన డబ్బులతో. ఇంకెవడో షేర్లను పెంచుతాడు, లేకపోతే అమ్మేసి తగ్గిస్తాడు. మధ్య లో, ఈ మధ్య తరగతి కే బొక్క.లేకపోతే రోజూ ఆడాలి.
కొద్ది కొద్ది లాభంతో సంతోషపడాలి. అమెరికా వాడి దగ్గర ఆయుధాల నిల్వ
ఎక్కువయ్యిందనుకో. ఏ విదూషకుణ్ణో రేకెత్తిస్తాడు. వాడు వీడి అండ చూసుకుని, ఏ రష్యా నో నానా మాటలూ అంటాడు. రష్యా కీ, చైనా కీ, ఎంత భూమి ఉన్నా చాలదు. ఇంకేం, ఇక యుద్ధం మొదలు. అమెరికా వాడు పాతబడిన
ఆయుధాలు వొదిలించుకుంటాడు. డాలర్లు ప్రింటింగ్ చేస్తాడు. ఈ కల్లోలం సరిపోలేదా
-అరబ్బులు, ఇజ్రాయెల్ వాళ్ళు ఉండనే వున్నారు కొట్టుకు చావడానికి. ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందని, మన స్టాక్ మార్కెట్లు పడిపోతాయి. డబ్బులు
మధ్య తరగతి నుంచి, పెద్ద ట్రేడర్లు, ఇన్వెస్ట్మెంటు కంపెనీల దగ్గరికి బదిలీ. ఇదంతా
ఒక చట్రం. నీలాంటి తెలివైన వాళ్ళు, ప్రపంచం పోకడ తెలిసిన వాళ్ళు దిగరు. నీ లాంటి
వాళ్ళు ఏవో కొత్తవి తయారు చెయ్యాలి అనుకుంటారు - సినిమాలే కావొచ్చు ( డాక్టర్ జే గురి గట్టిది), . ప్రజలు పడుతున్న బాధలు తీర్చడం ఎలా అన్న ఆలోచనలే కావొచ్చు.. చదువు వల్ల వచ్చిన జ్ఞానం, కుటుంబ సంస్కారం నుంచీ నేర్చుకున్న విలువలు...యిలాంటివి స్టాక్ మార్కెట్లో డబ్బు తిప్పుతూ సంపాదించే వ్యాపకానికి నీలాంటి వాళ్ళను దూరంగా వుంచుతాయి. మిడి మిడి జ్ఞానం తో, అత్యాశ తో దిగే వాళ్ళే ఎక్కువ. నూటికి 98 మంది అలాంటి వాళ్ళే. అందుకే పదో
తరగతి కూడా పాస్ కాలేని యే గుజరాతీ వాడో, సింధీ వాడో, వందల, వేల కోట్ల రూపాయలను తిప్పుతూ ఉంటారు. వాడి కింద క్లర్కులుగా పని చేయడమే ఐఐటీలు,. ఐఐఎం లూ చదివిన వాళ్ళ ధ్యేయం. ఒక రకం గా, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంటే, కోడి పందేల్లో, గుఱ్ఱపు పందేల్లో పెట్టడం లాంటిదే. ఆ గుఱ్ఱాలు మనవి కావు. రౌతులూ మన వాళ్ళు కారు. ఇంతకు ముందు గెలిచింది కాబట్టి, మళ్ళీ గెలిచే అవకాశాలు వుంటాయని, గుర్రాలను స్టడీ చేసినట్టు, కంపెనీలను స్టడీ చేసి డబ్బు పెడతారు. డబ్బులు వొచ్చినా నీ తెలివి కాదు. మార్వాడీ బ్రోకర్లు ఆడే ఆటలో, ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలలో, నీ డబ్బు ఒక గుర్రానికి వేసే దాణా మాత్రమే."
మోహన్ అంతా వింటున్నాడు. ఈయన చెప్పే దాంట్లో నిజానిజాలు ఎలా వున్నా, తనను ఆల్మోస్ట్ మేధావుల వర్గంలో వేయడం నచ్చింది. నీలాంటి వాళ్ళు స్టాక్ మార్కెట్లో కి రారు అనడం, నిందా స్తుతి లా వుంది.బాగుంది. ఇలా తనను ఒకటి లేదా రెండు అంచెలు ఎక్కించి మాట్లాడినవారు ఈ మధ్య కాలంలో, అహ..చాలా ఏండ్ల గా తారసపడలేదు. ఆ సంతోషం లో ఇంకో పెగ్గు పోసుకున్నాడు. పోసుకున్నాడో, డాక్టర్ జే యిస్తే తీసుకున్నాడో గుర్తులేదు. అది అంత ముఖ్యమైన విషయం కూడా కాదులే.
డాక్టర్ జే మాట్లాడుతూనే ఉన్నాడు.
"ఇహ పోతే, నా విషయానికి వద్దాం. నా క్లైంట్స్..వాళ్ళని పేషెంట్స్ అనడం నాకు
ఇష్టం లేదు. నా క్లైంట్స్ దగ్గర నేను యింత ఫీజు యివ్వండి అని అడగను. నీకు తెలుసు
కదా. (మోహన్ కి ఎలా తెలుస్తుంది? తెలీదు.అసలు ఆయనకు క్లైంట్స్ ఉన్నారో లేదో కూడా తెలియదు.) నేను వాళ్లకు కోచ్ ని మాత్రమే. వాళ్ళ సమస్యలను అర్థం చేసుకుని విడమర్చి చెప్తాను. వాళ్ళు తమ మానసిక పరిస్థితి ని సవరించుకుని, ముందుకు వెళ్తూ , తమకు తోచిందేదో యిస్తారు. నేను కాదనను. అంతే.
డబ్బు పుష్కలంగా సంపాదించడానికి నా దగ్గర కొన్ని మార్గాలున్నాయి. వాడుతూ ఉంటాను. ఆ
మార్గాల్లో ఒకటి, నీకు సరిగ్గా సరిపోయేది ఒకటుంది. అదే ఇప్పుడు నేను నీకు
చెప్పబోతున్నాను, అని ఆగాడు.
మోహన్ మూడో పెగ్గు చివరిలో ఉన్నాడు.
ప్లేట్ లో స్నాక్సు డాక్టర్ జే ఖాళీ చేసినట్టు తెలుస్తోంది. ఇంకో ప్లేటు స్నాక్స్ చెబ్దామా లేక ఇంతటితో ముగించి గుడ్ నైట్ చె... బు.. దామా.
ఆలోచిస్తూండగానే , అప్పారావు అనబడే ఆ క్లబ్ హౌస్ నౌకరు ఒక గ్లాసు మజ్జిగ, ప్లేటులో ఒక ఆమ్లెట్టు తీసుకుని వచ్చాడు. మోహన్ వెంటనే ఆమ్లెట్ ని
తుంచి ఒక పెద్ద ముక్క నోట్లో వేసుకున్నాడు. మధ్యాన్నమెప్పుడో మసాలా దోశ
తిన్నాడేమో. ఇప్పుడు తెలిసింది ఆకలి. మిగిలిన పెగ్గు నోట్లో పోసుకుని, గబగబా ఆమ్లెట్ తినడం మొదలు పెట్టాడు.
డాక్టర్ జే ఏదో ఆలోచిస్తూ మజ్జిగ గ్లాసు
తీసుకున్నాడు.ఎవరో మ్యూజిక్ సిస్టం లో సౌండు పెంచినట్టున్నారు. ఇళయరాజా పాట కి వయోలిన్ కవర్. సుందరీ, నేనే నువ్వంట..
ఇద్దరూ ఒక నిమిషం పాటు మౌనంగా ఉన్నారు. మోహన్ కి
అప్రయత్నంగా కళ్ళలో నీళ్లు నిండాయి. చిన్నప్పటినుంచీ యింతే. మంచి మ్యూజిక్ వింటే చాలు. లోపల్నించి ఉబికి వస్తాయి కన్నీళ్లు.
డాక్టర్ జే గొంతు సవరించుకున్నాడు. ఆ పాట
ఎత్తుకుంటాడేమో, అనుకున్నాడు మోహన్.
"నువ్వు మంచి ఆకలి మీద ఉన్నావని ఆగాను. విషయం త్వరగా ముగిస్తాను. డల్లాస్
నుంచి ఒకడు ఫోన్ చేస్తాడు."
కొద్దిగా నిరుత్సాహ పడ్డాడు మోహన్. మందు
కొట్టేటప్పుడు మంచి పాటలు పాడుకోవడం కాలేజీ రోజుల్నించీ అలవాటు. ఇక్కడ పాడుకోలేము. కనీసం వింటూ ఆ సంగీతం గురించి
మాట్లాడుకుంటే బాగుంటుంది, అనుకున్నాడు మోహన్. అయినా, ఈ డాక్టర్ చెప్పేదీ నిజమే. వెళ్లి పడుకుంటే ఓ పనై పోతుంది, అనుకున్నాడు.
"స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం కదా... " అంటూ మోహన్ వైపు
చూశాడు బదులు రాకపోయేసరికి, మళ్ళీ మొదలెట్టాడు.
"
స్టాక్ మార్కెట్ కంటే, మన లాంటి వాళ్లకు కమొడిటీస్ అంటే సరుకుల మార్కెట్ సరిగ్గా సెట్ అవుతుంది.
గోధుమలు,బియ్యం, చక్కెర, సోయా బీన్సు, మిల్లెట్సు, మొక్క జొన్నలు యిలాంటివి.ఇంకా బంగారం, వెండి, ప్లాటినం లాంటివి ఉన్నాయనుకో... కానీ కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. ఈ
సరుకుల విషయంలో పెద్ద మతలబులు ఏమీ ఉండవు. రేట్లు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కొని, మనకు కావాల్సిన రేటు రాగానే, అమ్మేయడమే. ఈ రోజు ఒక లక్ష పెట్టావనుకో, ఒక 30 వేలు లాభం చూస్కుని అమ్మితే చాలు, మరీ ఎక్కువ ఆశ పడకుండా. కొంత మంది ఇందులో కోట్లు తిప్పేవాళ్లు ఉంటారనుకో. మన లాంటి వాళ్ళు, నెలకి ఒక రెండు, మూడు ట్రేడ్లు చేస్తే చాలు. అసలు కిటుకు ఇంకొకటి ఉంది. మనకి తెలిసిన బ్రోకరు ఉన్నాడనుకో. మొత్తం మార్జిన్ పెట్టక్కరలేదు.
ఒక లక్షో, లక్షన్నరో పెట్టి, అయిదు లక్షల సరుకు కి ఆర్డర్ పెట్టొచ్చు.
ముంబై లో ఉండే పెద్ద బ్రోకర్లకు ఇక్కడ భాగ్యనగరం లో బ్రాంచీలు ఉంటాయి. అక్కడ ఉండే
మేనేజరు మన వాడైతే చాలు. నా వల్ల బాగా లాభపడిన మేనేజర్లు ఉన్నారులే. విజీవాడ వాడొకడు, అనకాపల్లి బ్యాచ్ ఇంకొకడు. డబ్బు రొటేషన్
విషయంలో నీకు కొంచెం వెసులుబాటు ఉంటుంది."
మోహన్ కి అర్థం అయినట్లే వుంది కానీ, ఏవో కొన్ని అనుమానాలు. అవి అన్నీ ఇప్పుడు అడిగే బదులు, రేపు పొద్దున కనుక్కోవచ్చు గదా అనుకున్నాడు. అదే అన్నాడు కూడా.
"
సరే,తొందరేం లేదు. కానీ, ఈ విషయం ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు. నన్ను చుట్టుముడతారు. ఆ
మేనేజర్లు మన వాళ్లే గానీ ఏదో నాతో బాటు ఇంకొకరికైతే సర్దగలరు. ఈ మంద ని తీస్కెళితే, అసలు కే
మోసం. నాకు రేపు కొన్ని పనులున్నాయి. అయినా సరే, చూస్తాను. సోమాజిగూడ కి వెళ్ళాలి మనం. రేపు కుదరకపోతే ఎల్లుండి వెళ్దాం, " అంటూ లేచాడు. బిల్లు డాక్టరు ఖాతా లో వేసినట్టున్నాడు అప్పారావు.
ఆ తర్వాత రోజు డాక్టర్ జే కి మోహన్ ని కలవడం
కుదరలేదు. అసలు, ఆ తర్వాత మూడు రోజులకి గానీ.మళ్ళీ క్లబ్బు లోనే కలిశాడు. ఈ సారి మోహన్ కొంచెం ప్రిపేర్ అయి వచ్చాడు.
(To be continued)
Comments