Skip to main content

 ఈ రొజు నీదే!


Chapter 1 - Part 1


తన సమస్యలను కప్పి పుచ్చుకోవడం లో మోహన్ వేమూరి ఎవరికీ తీసిపోడు. మోహన్ తన గురించి తాను అలా అనుకోవడం లో తప్పు లేదు. సమర్థించుకోవడానికి కొన్ని అదనపు హంగులూ ఉన్నాయి. మోహన్ పూర్వాశ్రమం లో నటుడు – సరే, చిన్నపాత్రలే కావొచ్చు – కానీ, నటన అంటే ఏమిటో తనకి తెలుసు.

అంతే కాదు. ఇప్పుడు మోహన్ నోట్లో ఖరీదైన, పొడవాటి, సన్నటి, సిగరెట్ వెలుగుతూ ఉంది. తలని ఒక క్యాప్ అలంకరించి ఉంది. ఒక మనిషి నెత్తిన క్యాప్ పెట్టుకుని, నల్ల కూలింగ్ కళ్ళద్దాల తో, సిగరెట్ తాగుతూ ఉంటే, అతనికి ఒక సౌలభ్యం ఉంటుంది. మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడం కష్టం.

ప్రతి రోజు మాదిరే, పొద్దున్నే,  పన్నెండో అంతస్తు నుంచి లిఫ్టులో గ్రౌండ్ ఫ్లోర్ లో లాబీ కి మీట నొక్కాడు మోహన్. తనకి ముందు రోజు పొస్టులో ఏవైనా వచ్చాయేమో (ఏమీ రావు), చూసుకుని, బ్రేక్ ఫాస్ట్ కి డైనింగ్ హాల్ కి వెళ్దామని ప్లాను. తను చూడడానికి మంచి సంపాదనాపరుడి లానే కనబడుతున్నాడని అతని నమ్మకం; కాదు ఆశ. ఒక రకంగా చెప్పాలంటే, కేవలం ఆశ మాత్రమే. ఎందుకంటే, ఇప్పుడు ఉన్న గెటప్ ని ఇంకొంచెం మెరుగు పరిచే శక్తి కూడా అతనికి లేదు.

లిఫ్టు లో వస్తూ, నాలుగో అంతస్తులో, నాన్న ఎక్కుతాడేమో అని చూశాడు. మామూలుగా వాళ్ళిద్దరూ ఇదే టైముకి రోజూ బ్రేక్ ఫాస్ట్ దగ్గరే కలుస్తారు. ఇతరుల కళ్ళకి తను ఎలా కనబడుతున్నాడో అన్న అదుర్దా కంటే, నాన్న తన వాలకం, బట్టలను చూసి ఏమనుకుంటాడొ, అనే ఎక్కువ ఆలోచిస్తున్నాడు మోహన్ ఈ మధ్య.

నాలుగో అంతస్తులో లిఫ్టు ఆగలేదు. ఆ లోహ పంజరం మెత్తగా బిలం లోకి మునిగింది. లాబీ లెవెల్ కి రాగానే, సుయ్యి మని తలుపులు తెరుచుకున్నాయి. వెలిసిపోయిన రక్తం రంగు తివాచీ, అక్కడక్కడా సొట్టలు పోయి, ఉబ్బి,లిఫ్టు తలుపుల వరకూ పర్చుకుని ఉంది. పొడుగాటి కర్టెన్లు ఒక వైపు ఉన్న కిటికీలను కప్పగా, అక్కడంతా లాబీ మసక చీకట్లతో, నిద్ర మత్తులో ఉన్నట్టుంది. లాబీ కి మరొక వైపు మాత్రం, మూడు ఫ్రెంచ్ కిటికీలు తెరుచుకుని, నీలాకాశం, ఎండతో పాటు తొంగి చూస్తూ ఉంది. ఒక పావురం రెక్కలు టపటప లాడిస్తూ, ఆ బిల్డింగ్ ముందు వైపు కి ఉన్న సినిమా హాల్ మార్కీ కి బిగించిన గొలుసు మీద వాలబోయింది.

ఆ శ్రీనివాసా కాంప్లెక్సు లో ఎక్కువ మంది రిటైర్మెంటు దాటి కొన్ని, లేదా చాలా సంవత్సరాలు అయిన వాళ్ళే. అలాగని అది ఓల్ద్ యేజ్ హోమ్ కాదు. ఎన్టీ రామారావు పదవిలోకి వచ్చిన కొత్తల్లో, హైదరాబాదు నగరం శ్రీనగర్ కాలనీ దాటి, బంజారా కొండల మీదుగా ప్రాకుతూ, జుబిలీ కొండల్లో భవనాల కట్టడం పెరుగుతున్న రొజుల్లొ, కొంతమంది చిరు వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరాదులు జుబిలీ కొండలు దిగిన తరువాత, చవగ్గా కొంత స్థలం కొనుక్కున్నారు. తలకు వంద, నూట యాభై గజాల చొప్పున సుమారు రెండు వేల గజాలు. చంద్రబాబు తన పాత మిత్రుడు రాజశెఖర్ రెడ్డీ చేతిలో 2004 లొ ఓడిపోయె నాటికి ఆ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. మొదట్లో స్థలం కొన్నవారు ఎవరో బిల్డర్ కి అభివ్రుద్ది చేయమని యిస్తే, ముందు వైపుకి హోటలు, సినిమా హాలు, కొన్ని షాపులు, వెనక వైపుకి పన్నెడంతస్తుల అగ్గిపెట్టె అపార్ట్మెంట్లు కట్టారు. ఆ అపార్టుమెంట్లన్నీ మొదట్లొ స్థలం కొన్నవారికి ముప్పావు భాగం ఇచ్చి, మిగిలినవి అమ్ముకున్నాడు ఆ బిల్డరు.

అన్ని సదుపాయాలు దగ్గరలో ఉండేసరికి, పదవీ విరమణ చేసి, పిల్లలు అమెరికా లొనో, ఇంకెక్కడో ఉంటున్న చాలా మంది దంపతులు, ఒంటరి వారు, అక్కడికి వచ్చి చేరారు. ఇక పోతే, ఆ బిల్డర్కి  సినీ పరిశ్రమ తో సంబంధాలు ఉండడం వలన (కొన్ని సినిమాలు తీసి, కొంత సంపాదించి, చాలా పోగొట్టి), ముందు జాగ్రత్త పడ్డ ఓ మోస్తరు కళాకారులు, సినీ సాంకెతిక నిపుణులు, అలాంటి వాళ్ళ కి కూడా, ఆ శ్రీనివాసా కాంప్లెక్సు కేరాఫ్ అడ్రస్సు అయ్యింది. వండుకొవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళే ఎక్కువ కాబట్టి, కాంప్లెక్సు కమిటీ, ముందరే ఉన్న హోటలు తో ఒప్పందం చేసుకుని, మూడు పూటలూ ఫలహార, భోజన, పానీయాల సరాఫరా జరిగేలా అమర్చుకున్నారు.

వాతావరణం మరీ వేడిగా ఉన్నప్పుడు తప్ప, లేదా వాన పడుతున్నప్పుడు తప్ప, ఆ భవనం లోని ముసలి వాళ్ళు చుట్టూ ఉన్న అంగళ్ళ్ల లోనూ, పక్కనే ఉన్న జీ హెచ్ ఎం సీ పార్కు లోని సిమెంటు బెంచీల పైనో, లాబీ కి ఒక మూల ఉన్న రీడింగ్ రూము లోనో, తచ్చాడుతుంటారు. అప్పుడప్పుడూ, కొంత మంది ప్రగతిశీల కవులూ, రచయిత/త్రులూ ఎవరి ఆహ్వానం మీదనో వచ్చి,  జమకూడిన పది మందినీ అలరించీ లెదా రేకెత్తించి, మదర్పిత తీనీరు లెదా మద్యము సేవించి, సమోసా, పకొడీ గట్రా ఆరగించి, త్వరలో మళ్ళీ కలుద్దామంటూ వెళ్తారు. నెలకో, రెండు నెల్లకో, బిల్డరు మనుషులు ఎవరో ఒక రాజకీయ శాల్తీని అక్కడికి తీసుకువచ్చి, ఆ వానప్రస్థాశ్రమ వాసులను పోగు చేసి, తమ సమీకరణా సామర్థ్యం చూపించుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న ఉడిపి హొటల్స్ లొనే కాదు, ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా, ఆ కాంప్లెక్స్ సభ్యులు కనబడుతూ ఉంటారు.

ఈ వయోజనుల గోల మధ్య, మోహన్ ఇమడలెక పోతున్నాడు. వీరితో పోలిస్తే, నలభై నాల్గు-నలభైఐదు ఏళ్ళ మోహన్ యువకుని క్రిందికే లెక్క. పొడుగ్గా, కొంచెం రంగు తగ్గినా, ఇంకా పోని పసిమి చాయతో, పాపట తీయతగ్గ జుట్టు తో, బలంగా కనబడే భుజాలతో, నిండైన విగ్రహం మోహన్. బరువు పెరగడం మొదలయ్యి ఓ ఆరేడు ఏళ్ళయింది.

ఉదయం టిఫిన్ తరవాత, ఎక్కువ మంది లాబీ లోని సొఫా కుర్చీల్లోను, రీడింగ్ రూం టేబుళ్ళ వద్దా, న్యూస్ పేపర్లు చదువుతూ, రాజకీయాలు, పుకార్లు – కాంప్లెక్సు కు సంబంధించినవో, రాష్ట్రానివొ, దేశ, అంతర్జాతీయ తగాదాలో, ఏవో ఒకటి మాట్లాడుతూ సమయం గడిపేస్తారు. 

మోహన్ కి అది అలవాటు లేదు. రోజూ పొద్దున్నే తయారయ్యి, ముఖ్యమైన పనులు ఉన్నవాడిలా, ఉత్సాహంగా బైటికి వెళితేనే అతనికి కుదురుగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా, ఏ ఉద్యొగం లేకపొయినా, నీటుగా షేవింగ్ చేసుకుని, ఎనిమిది గంట్ల కల్లా రేడీ అయిపోయి లాబీ లోకి రావడం అలవాటు చెసుకున్నాడు.

బయట ఉన్న టీ సెంటర్ వద్ద న్యూస్ పేపర్ కొనుక్కుని, ఒకటొ రెండో టీలు తాగి, సిగరెట్లు కాల్చి, బ్ఱేక్ ఫాస్ట్ కి తండ్రి ని కలిసి, తరువాత మళ్ళీ బయటకు వెళ్తాడు. చూసే వారికి, తను ఏదో వ్యాపకం మీదే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అలా వెళ్ళడమే ఒక ముఖ్యమైన పని. కానీ, ఇలా ఇక ఎంతో కాలం నడపడం కష్తమని మోహన్ కి అర్థమై పోయింది. ఈ రోజు కొంచెం ఆందోళనగా కూడా ఉంది. తన రౌటీన్ భగ్నం కాబోతున్న ఫీలింగ్. తప్పకుండా ఎదుర్కోవాలని తెలిసీ, ఎంతో కాలంగా దాటవేస్తున్న, రూపమంటూ లేని ఒక పెద్ద కష్తం, ఈ రోజు తన ముందుకు రాబోతూందని తెలుస్తూ ఉంది. ఆ సమస్య సాయంత్రం లోగా తనకు పరిచయమౌతుంది.

టీ షాపు మస్తాన్ కి చూపు కొంత బలహీనం, అని చూసినవాళ్ళు అనుకుంటారు. అతనికి నిజం గానే కళ్ళు మందగించాయో లేదో చెప్పటం కష్తం. అతని కళ్ళ వాలకం అలాంటిది. ఏ భావాలూ పలకవు. అలా నిశ్చలంగా, పొడుగాటి కనురెప్పలతో, శూన్యం లోకి చూస్తూ పొడిగా మాట్లాడతాడు. పెదాలు నవ్వే ప్రయత్నం చేసినా, కళ్ళు మాత్రం నిస్తేజాన్ని కోల్పోవు. విచిత్రమేమంటే, మంచి బట్టలు వేసుకుంటాడు. బడ్డీ కొట్టు కౌంటర్ లో వాడికి అంత మంచి బట్టలు వేసుకోవాల్సిన అవసరమేముంది, అని కొంత మంది కష్టమర్లు అనుకోవచ్చు. అడిగినా అడిగే ఉంటారు. సమాధానం దొరికి ఉండకపోవటానికే అవకాశం ఎక్కువ, కావలి నుంచో, నెల్లూరు నుంచో చాలా ఏళ్ళ క్రితమే హైదరాబాదు కి వచ్చిన కుటుంబమట. తెలుగు బాగా మాట్లాడటమే కాదు, కొంత మంది కవులూ, రచయితలకి చేబదులు ఇచ్చేటంత మహారాజ పోషకుడు కూడా. మోహన్ తండ్రి అంటే మస్తాన్ కి గౌరవం, అభిమానం. దాని వల్ల, మోహన్ తో, అభావంగా నైనా, కొంచెం చనువు చూపిస్తాడు.

ఈ రోజు మస్తాను ఒక లేత ఊదా రంగు ఫార్మల్ చొక్కా, బ్లాక్ ప్యాంటు, బ్లాక్ లెదర్ షూస్ వేసుకుని, టక్కు చేసుకుని, చార్మినార్ దగ్గరి ఇరానీ గల్లీ లో దొరికే, గుల్నాజ్ అత్తరు సువాసన బడ్డీ కొట్టు పరిసరాల్లో వ్యాపింపజేస్తూ, దూరంగా దుర్గం చెరువు ఒడ్దున ఉన్న ఇనార్బిట్ మాల్ వైపు (లేదా శూన్యం లోకి) చూస్తూ, దగ్గరికి వచ్చిన మోహన్ వైపు చూడకుండానే, కావలసినవి అందించాడు.

“పెద్దాయన ఈ రొజు టిఫిన్ కోసం కొంచెం తొందరగా దిగినట్టున్నారు,” అన్నాడు.

“అవునా, నాకంటే ముందే?,” అంటూ సిగరెట్ వెలిగించాడు మోహన్. మొదట్లొ చెప్పుకున్నామే, క్యాప్ పెట్టుకుని, సిగరెట్ తాగుతూంటె, ఒక సౌలభ్యం ఉంటుందని. అది ఈ సన్నివేశం గురించే. మస్తాన్ నిర్లిప్తమైన కళ్ళతో పోటీ పడాలంటె, ఆ మాత్రం రక్షణ కావాలి మరి.

“చొక్కా బాగుంది. రాల్ఫ్ లారెన్?,” మాట మార్చాడు మస్తాన్. కళ్ళు ఒక లిప్త కాలం మోహన్ వైపు చూసి, మళ్ళీ నీలాకాశం వైపు మరలాయి.

“కాదు. ఎటన్ అని...లండన్ నుంచీ ఎవరో తీసుకొచ్చారు.” – మోహన్ లోని నటుడు నిద్ర లేచాడు.

మనసులో ఎంత దిగాలు గా ఉన్నా, ఇలాంటి అవకాశాలు మోహన్ లోని ఆశాజీవి ఒదులుకోడు. నాటకీయత లేకపోతే, తనకీ, మామూలు మనుషులకీ తేడా ఏముంటుంది? లోపలి ఒత్తిడి ని అణిచేసి, ఒక ప్రసన్నమైన ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం కంటె ఉన్నతమైనదేముంది !

మోహన్ ఆహ్లాదకరమైన విధంగా భ్రుకుటి ముడి వేశాడు. అలా మొహం పెట్టడం తనకి నప్పుతుందని ఒక దర్శకుడు చాన్నాళ్ళ క్రితం మందు కొడుతూ చెప్పాడు. అంటే, అది నిజం కూడా. మోహన్ అలాంటి కవళికలు, హావభావాలు కొన్ని (తనకి నప్పేవి) తయారు చేసి ఉంచుకున్నాడు. అవసరార్థం బైటికి తీస్తూ ఉంటాడు.

 తన నటనా తూణీరం లోనుంచి మరొక హావ బాణం తీశాడు మోహన్. ఒక అడుగు వెనక్కి వేసి, తన చొక్కా వైపు పరిశీలనగా చూస్తునట్టు మొహం పెట్టాడు. చిరునవ్వు చిందించాడు. ఆ చిరునవ్వు నెమ్మదిగా పెద్ద నవ్వు లా మారింది. మోహన్ పలువరస చిన్నది. నవ్వినప్పుడు, బుగ్గలు గుండ్రమవుతాయి. వయస్సు తగ్గినట్లుంటుంది. కాలేజీ రోజుల్లొ, నిర్లక్ష్యంగా ఒదిలేసిన గిరజాల జుత్తు తో, అమాయకపు పెద్ద నవ్వుతో ఉండె మోహన్ ని చూసి, వాళ్ళ నాన్న, “నువ్వు ఇంత పెద్ద శరీరం పెట్టుకుని కూడా, నీ నవ్వుతో, వాలకం తో, ఎవరినైనా ప్రసన్నం చేసుకోగలవు,” అనే వాడు.

“నాకు ఈ బూడిద రంగు అంటే ఇష్తం. కానీ, ఈ చొక్కా ని ఉతకలేము. డ్రై క్లీనింగ్ కి పంపించాల్సిందే. ఉతికి, ఇస్త్రీ చేసినప్పుడు వచ్చే మంచి వాసన, డ్రై క్లీన్ అయితే రాదు. మంచి చొక్కా నే. నాలుగైదువేలు ఉంటుంది ధర,”

ఆ చొక్కాని మోహన్ కొనలేదు. లండన్ నుంచీ తెప్పించుకోలెదు. మోహన్ కి వాళ్ళ బాస్ (మాజీ) కానుకగా ఇచ్చాడు. తరువాత, ఆ బాస్ తో మోహన్ కి చెడింది. ఉద్యోగం ఊడింది. కానీ, ఈ చరిత్ర అంతా మస్తాన్ కి చెప్పాల్సిన కారణం ఏదీ కనిపించలేదు మోహన్ కి. బహుశా, మస్తాన్ కి తెలిసే ఉంటుంది. మస్తాన్ లాంటి వాళ్ళకు, అన్ని విషయాలూ అలా తెలిసిపోతూంటాయి.

ఆ మాటకొస్తే, మస్తాన్ గురించి కూడా మోహన్ కి చాలా విషయాలు తెలుసు. అతని భార్య గురించి, వ్యాపారం గురించి, మస్తాన్ ఆరోగ్యం గురించీ. కానీ, ఇవన్నీ ప్రస్తావించలేడు. ఇలా మాట్లాడుకోలేని విషయాల మోయలేని బరువు, వారిద్దరి మధ్యా, ఎక్కువ మాట్లాడే అవకాశం లేకుండా చేసింది.

(To be continued)


Comments