ఈ రోజు నీదే ! - Part 2
Link to Part 1
“ఈ రోజు చూడ్డానికి చురుగ్గా కనిపిస్తున్నావు,” అన్నాడు మస్తాన్.
“నిజమా? నీ కళ్ళకి అలా అనిపిస్తూందా,” అంటూ ఒకసారి ఆ పాన్ షాపు అద్దాలలొ తనని తాను చూసుకున్నాడు మోహన్.
లోపల అతికించిన గొప్ప వాళ్ళ ఫోటోలు, వాటి క్రింద పేర్చిన సిగరెట్ పెట్టెల దొంతరలు
– శ్రీ శ్రీ, చేగువేరా, కృష్ణుడి వేషంలో ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి,
గాంధీ, బోసు, శ్రీదేవి, కపిల్ దేవ్, ఒక పాత తరం నటీమణి -
కన్నాంబో, కాంచనమాలో - మస్తాన్ అభిరుచి కలగాపులగం లోంచి తన మొహం…విచిత్రంగా చూస్తూ కొంచెం తిక్క
నవ్వుతో…ఇంప్రెసివ్ గా అయితే లేదు. మరి మస్తాన్ చురుగ్గా ఉన్నావని ఎందుకన్నాడో…ఆటపట్టించే రకం కాదు తను.
మసక బారిన అద్దాల్లో మరొక్క సారి చూసుకున్నాడు. వెడల్పాటి నుదురు పై, బ్రాకెట్ల లాంటి ముడుత భృకుటి మధ్యలో.
..ఖేచరీ సాధన చేశాను అని చెప్పుకున్నా నమ్మేస్తారేమో ! రెండు చెంపల పై కొంచెం మసి బారుతున్న పసిమి. అద్దం లోంచి తన వైపే చూస్తున్న ఆ ఆందోళన, ఆశావహం కలిసిన కళ్ళు…క్షణ కాలం విస్మయం, అంతలోనే సెల్ఫ్-పిటీ, చివరికి నిరుత్సాహం - మోహన్ ఏమీ పాలుపోక అలా
వుండిపోయాడు..ఒక రెండు మూడు క్షణాలు.
మొత్తానికి ఒక పెద్ద, గుండ్రటి మొహం. తన ముక్కుపుటాలు ఇంకొంచెం చిన్నవిగా ఉండుంటే బాగుండు ..పెదాలు కూడా. పైన టోపీ, నోట్లో వెలుగుతున్న సిగరెట్టు..చూడ్డానికి అంత గొప్పగా లేడు.మరి మస్తాన్? పూర్తి కటౌట్ గురించి చెప్పాడేమో?
ఏవైనా శారీరక శ్రమతో కూడిన పనులు చేసుంటే జీవితం బాగుండేది. మంచి నిద్ర పట్టేలా చేసే, నిజాయితీ తో కూడిన పని. లోపల్నుంచి
తన్నుకొచ్చే శక్తి ని ఖర్చు పెట్టుంటే, మనసు తేలిగ్గా ఉండి, ఆ మెరుపు మొహం లో కూడా కనపడేది. ఇలా, ఇంకా, ఏదో సాధించాలి, నిరూపించుకోవాలి, అన్న వెలితి ఉండేది కాదు.
నటుడు అవ్వాలని తను చాలా ట్రై చేశాడు.
కానీ, అది కష్టపడటం కిందకి రాదు కదా. మొదట్లో హీరో అవ్వాలని
తను చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడానికి, ఈ మొహమే కారణం, ఒక రకంగా. ఎర్లీ 2000స్ లో, చాలా కొద్ది కాలం, బహుశా కొన్ని నెలల పాటు, తనవి హీరో లుక్స్ అనే అన్నారు. హిందీ హీరో లా
ఉన్నావు అనేసరికి, ముంబాయి వెళ్ళిపోయాడు. అక్కడ, ఒక లాంటి మూర్ఖపు పట్టుదల తో ఒక ఏడెనిమిది
ఏళ్ళు ప్రయత్నించాడు. తన భ్రమలూ, కోరికలూ ఒక రెండు మూడు
ఏళ్లకే ఆవిరైనా, ఓటమి ఒప్పుకునే ధైర్యం లేకనో, ఆప్టిమిస్టు కావడం వల్లనో, వాస్తవాలను గుర్తించని యవ్వనపు గర్వం వల్లనో,
లేక కేవలం సోమరితనం వల్లనో, అక్కడే ఉండిపోయాడు.
చివరికి ఏవో ఉద్యోగాలలో చేరాడు కానీ, ఆ
ఎనిమిదేళ్ళ నిరీక్షణ, ఓటమి - తనని ఏ ఉద్యోగ విజయానికీ అర్హుణ్ణి చేయలేదు. అలాగని పూర్తిగా పనికిరాకుండా కూడా పోలేదు. హీరో అవబోయి సేల్స్ మాన్ అయ్యాను, అన్న విషయం తొలుస్తూ వుంటే,
కష్టమర్లని చూస్తే కంపరమే పుట్టేది. ఏ ఉద్యోగం లోనూ ఇమడలేక పోతున్నాను అనుకొని మానేసేవాడు. లేదా,
వాళ్ళే నీ హీరోయిజం
ఇక్కడ వద్దులే అని పంపించేసేవారు.
ప్రతి ఉద్యోగం, మొదట్లో బాగుండేది. తోటి ఉద్యోగులు, బాసుల తో కలిసి - బార్ల
లోనో, రూముల్లోనో, మందు కొడుతూ,
వాళ్ళు సినిమా విషయాలు అడుగుతుంటే,
తాను నిజాలూ, కల్పనలూ విస్కీ లో సోడా లా కలిపేసి చెబుతూ…కొన్ని
నెలల తర్వాత.. "నీకు పని పై ఇంట్రెస్టు లేదు..అందుకే సినిమాల్లో కుదర్లేదు..ఇక్కడా అంతే…
లాంటి మాటలు.ఇంకో చోట అలాంటి ఉద్యోగమే.. మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్.
తండ్రి ఒక పేరుమోసిన వైద్యుడు కావటం వల్ల, తాను
డాక్టర్ గానో, లాయర్ గానో, లేక ఒక
వ్యాపారస్తుని గానో, ఒక ప్రొఫెసర్
గానో స్థిరపడతాడని అందరూ
అనుకున్నారు. "మన కులంలో నిష్ప్రయోజకులే ఉండరోయ్..ఏదీ కాకపోతే, ఏ కమ్యూనిస్టు పార్టీలోనో చేరి, వివాదాలు పరిష్కరిస్తూ, గుడ్
విల్ తో పనులు చక్కబెట్టుకుంటూ, కాలం గడిచేకొద్దీ, పేరూ, ఆస్తులు గడిస్తారు
మనోళ్లు, " అని చాలా ఏళ్ల క్రితం, విజయవాడ లో, ఒక పెళ్లి కి వెళ్ళినపుడు, మేనమామ వరసయ్యే ఒక శ్రేయోభిలాషి
తత్త్వం విడమరిచి చెప్పాడు. అప్పుడు మోహన్ బాంబే లో
అయిదు ఏళ్ల గా ఉన్నాడు. ఎవరూ తన కులాన్ని గుర్తించలేదు.
కులం కార్డు పని చేయాలంటే, హైదరాబాదు కో, కనీసం చెన్నై కో మారాలి. బొంబాయి లో ఓటమి తనని
కృంగదీసింది, కానీ మనిషి గా ఏదో కొంచెం డిగ్నిటీ మిగిలే ఉంది. హైదరాబాదుకి వచ్చి, ఇక్కడి సినిమా ఆఫీసుల్లో, వాళ్ళు తన తండ్రి పేరు
తెలుసుకొని, సినిమా కి పెట్టుబడి కోసం తండ్రి ని అడగమని చెప్తే, ఉన్న కొంచెం గౌరవం కూడా పోతుంది...
అలా బొంబాయి కి వెళ్లకుండా వుంటే, ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సు చేసి ఉండేవాడు. నాన్న గారు కూడా తనని కొడుకు అని చెప్పుకోవడానికి అవమాన పడి ఉండేవారు కాదు.
ఇవన్నీ పక్కన పెడితే, తనని తాను తెలుసుకోవడం లో, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం లో, ఆలస్యం జరిగింది కాబట్టి, సక్సెస్ వచ్చినప్పుడు పడాల్సిన కష్టం, ఆ సక్సెస్ రాకపోవడం వల్ల, అసలు ఖర్చే కాక, తనలోని శక్తీ,, జీవ చైతన్యం లోలోపల ఉక్కిరిబిక్కిరి అవుతూ, తనకి ఎంతో నష్టం కలిగించింది, అని మోహన్ గట్టిగా నమ్ముతూ ఉన్నాడు.
అన్ని పూలూ వికసిస్తాయి. కొన్ని చాలా సంవత్సరాలు తీసుకుంటాయి. కొన్ని పూలు ఒకలాంటి కొండల్లో, అడవుల్లో మాత్రమే పూస్తాయి. వాటిని వేరే చోటికి తీసికెళ్ళి, మాలి ఎంత మనసు పెట్టి పెంచినా, పూసీ పూయనట్టు ఉంటాయి. తన లాంటి లేట్ బ్లూమర్స్ ఒక్కసారి విజయం సాధిస్తే, అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆలోచనల్లో పడ్డ మోహన్, మస్తాన్ మళ్ళీ పలకరించడంతో ఈ లోకంలోకి వచ్చాడు.
"నిన్న రాత్రి క్లబ్బు లో పేకాట కి వెళ్లలేదే ?"
వీడికి అన్నీ కావాలి. అన్నీ గమనిస్తూ ఉంటాడు, అనుకున్నాడు మోహన్.
"కుదర్లేదు...ఎలా జరిగింది?" అని బదులిచ్చాడు.ఇంకో సిగరెట్ వెలిగించాడు.
గత కొన్ని వారాలుగా, మోహన్ రోజూ రాత్రి పూట, క్లబ్బు లో పేకాట ఆడి, అక్కడే కొంచెం
తాగి, ఏదో ఒకటి తిని, ఫ్లాట్ కి
చేరేవాడు. కానీ, ఇంక ఈ పేకాట ఆడి, ఓడిపోయేంత డబ్బు లేదని అర్థమయ్యింది. తాను కాసేది చిన్న, చిన్న పందాలే. కానీ, రోజూ ఓడిపోతున్నాడు. ఒక్క రోజూ గెలవలేదు. ఇలా ముసలాళ్ళతో ఆడి , ఓడిపోయి, డబ్బులు
ఖాళీ చేసుకోవడం కంటే, ఏ సినిమా నో చూసొచ్చి, ఒక క్వార్టర్ బాటిల్ తో ఫ్లాట్ కి
చేరుకుంటే మంచిది, అన్న ఉద్దేశ్యం తో, నిన్న
దగ్గర్లో ఉన్న మాల్ కి వెళ్లి, ముల్టీప్లెక్సు లో ఒక హిందీ, ఒక ఆరవ డబ్బింగు తెలుగు సినిమా వెంటవెంటనే చూసి, దార్లో ఒక బండి దగ్గర, రెండు ఎగ్గు దోశలు పార్సల్ చేసుకుని, తన ఫ్లాట్ లో, మందు
కొడుతూ, దోశలు తిని, టీవీ లో ఏదో సినిమా చూస్తూ, కాసేపు ఏడ్చి, పడుకున్నాడు.
ఈ
మస్తాన్ గాడి వాలకం చూస్తే, వీడికి నిన్న రాత్రి తాను పేకాట కి రాకుండా, ఏం చేసాడో అన్న
కుతి తప్ప, ఒక మనిషి కి ఆ మాత్రం ప్రైవసీ ఇవ్వాలన్న సహానుభూతి లేదు.
"ఓహ్..నువ్వు మిస్ అయ్యావు, " అన్నాడు మస్తాన్.
ఎవరో బ్లింకిట్ ఆప్ లో రెండు కిళ్ళీలు (అవును..పొద్దున 9 గంటలకి !), రెండు సిగరెట్ పాకెట్లు, ఒక 2 లీటర్
వాటర్ బాటిల్ ఆర్డర్ పెట్టినట్టున్నారు. మోహన్ ని అలా సస్పెన్సు లో పెట్టి,
మస్తాన్ అన్నీ చకచకా ఒక పేపర్ బాగ్ లో పెట్టి, ఆ బ్లింకిట్ కుర్రాడి కిచ్చాడు. వాడు
తుర్రుమన్నాడు. మస్తాన్ ఒకసారి మోహన్ వైపు చూసి, మళ్ళీ
శూన్యం లోకి చూస్తూ మొదలుపెట్టాడు.
"అంతా మామూలే. బాగానే జరిగింది. కానీ, చంద్రా రెడ్డి తన టేబుల్ దగ్గర మిగతా వాళ్ళ పై గట్టి గా అరుస్తూ, పెద్ద డ్రామా చేసాడు. అయితే, చాలా రోజుల తర్వాత, నిన్న రాత్రి క్లబ్బు కి డాక్టర్ జే వచ్చాడు. ఆయన ఊరుకోలేదు. చంద్రా రెడ్డి అలా అరవడం వెనకాల ఉన్న మానసిక కారణాలను విశ్లేషించి చెప్పాడు. భలే గా ఉండింది. చంద్రా రెడ్డి గొణుక్కుంటూ, ఓడిపోయిన డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు."
"ఏమిటో ఆ మానసిక కారణాలు?"
"డాక్టర్ జే ఎలా మాట్లాడతాడో తెలుసు కదా! ఆయన మాటలు గుర్తు పెట్టుకోని చెప్పడం నా వల్ల కాదు." మస్తాన్ నవ్వి
మాట మార్చాడు. " టైమ్స్ కావాలా? నిన్న మార్కెట్లు ఎలా క్లోజ్ అయ్యాయో చూడవా?"
"పెద్ద గా ఉపయోగం లేదు. మధ్యాన్నం 3 గంటలకి ఎక్కడ ఉన్నాయో తెలుసు. కానీ, పేపర్ తీసుకొని ఒకసారి తిరగేస్తే మంచిది. ఇలా యివ్వు.", అంటూ చేయి చాపాడు.
(సశేషం)
Comments